సోమరి సర్పం కాళ్ళను కామ సర్పం బుద్దిని పెన వేసి
గమ్యం కానక అడుగు పడక అల్లాడుతూ నారాయణ
నీ నామ స్మరణయే ఊతముగా సాగనెంచిన నాపై
నీ దయా దృష్టి నేల నిలపవో గజ రాజ రక్షకా! శ్రీహరీ
గోవిందా నీ తలంపుల తుంపరలతో తనువుకు
స్వాంతన కలిగించ తపించు నాపై
నీ దయా దృష్టి నేల నిలపవో గజ రాజ రక్షకా! శ్రీహరీ
ములుకుల వంటి పలుకులతో చిద్రమైన మది
ముకుందా నీ ముసి ముసి నగవుల మోము గని
మురియ యత్నించు వేళ నాపై
నీ దయా దృష్టి నేల నిలపవో గజ రాజ రక్షకా! శ్రీహరీ
భాద్యతల బరువు మోయలేని అశక్తత తో బ్రతుకు
బండి భారమైన వేళ వేంకట రమణుడా బరువు
పంచుకోమని వేడ నెంచిన నాపై
నీ దయా దృష్టి నేల నిలపవో గజ రాజ రక్షకా! శ్రీహరీ
ఈశ్వర స్మరణతో ఉదయము భగవత్ సేవ యందు దినము
హరుని అర్చన తో సాయం రమణీయమగు హరి కధా శ్రవణంబున
రాత్రి గడుపు భాగ్యం ఒసగుమని కోరు నాపై
నీ దయా దృష్టి నేల నిలపవో గజ రాజ రక్షకా! శ్రీహరీ